తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం ముమ్మాటికీ పాపమే
సిట్,నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ లు ఇచ్చిన నివేదికలో నెయ్యి లేదు.. పామొలిన్, కెమికల్స్ ఉన్నాయని తేలిందని వెల్లడి
కమీషన్ల కోసమే నిబంధనలు సడలించి ‘బోలే బాబా’ సంస్థకు టెండర్లు
దొంగతనం బయటపడ్డాక వైసీపీ నేతల దొంగవాదనలు సిగ్గుచేటు అని మంత్రి దుర్గేష్ విమర్శ
న్యూస్4టుడే, 31 జనవరి 2026, నిడదవోలు: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వాదనలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రంగా ఖండించారు. నిడదవోలులో పర్యటించిన ఆయన కల్తీ నెయ్యి వ్యవహారంపై గత ప్రభుత్వం అనుసరించిన తీరును ఎండగట్టారు.తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై మంత్రి కందుల దుర్గేష్ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 250 కోట్ల టర్నోవర్ ఉండాలనే నిబంధనను 100 కోట్లకు, 3 ఏళ్ల అనుభవాన్ని ఏడాదికి తగ్గించి తమకు కావాల్సిన ‘బోలే బాబా’ వంటి సంస్థలకు టెండర్లు కట్టబెట్టి కల్తీ ఘటనకు పాల్పడ్డారని విమర్శించారు.
కమీషన్ల కోసం ఏ రకమైన ప్రమాణాలు పాటిస్తున్నారో చూడకుండా ఉండటం వల్లే కల్తీ నెయ్యి ఘటన చోటుచేసుకుందన్నారు. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ మరియు సిట్ నివేదికలు కల్తీ జరిగినట్లు స్పష్టం చేశాయని, నెయ్యిలో పామోలిన్,మోనో గ్లిజరైట్ తదితర కెమికల్స్ వాడారని తేలిందని చెప్పారు.
దేవుడిపై నమ్మకం లేని జగన్ అండ్ కో, తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి కూడా వెనకాడారని గుర్తుచేశారు. డిక్లరేషన్ ఇమ్మంటే ఏకంగా దేవాలయాల పైనే నిందలేసిన ఘన చరిత్ర వైసీపీదన్నారు. సిట్ క్లీన్ చీట్ ఇచ్చిందని వైసీపీ నేతలు దొంగ వాదనలు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ గద్దెనెక్కిన టీటీడీ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారని ఆగ్రహించారు. పాలే లేకుండా నెయ్యి ఎలా తయారు చేశారో స్పష్టం చేయాలని నిలదీశారు. పాపపు పనులు సిగ్గు లేకుండా చేసి మీ పాపాలను బయట పెట్టిన వారిపై నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
స్వచ్ఛమైన నెయ్యికి బదులు విషతుల్యమైన కెమికల్స్ వాడటం భక్తుల ఆరోగ్యంతో పాటు మనోభావాలతో ఆడుకోవడం కాదా? అని ప్రశ్నించారు. ఒక పవిత్రమైన ఆలయ ప్రసాదం విషయంలో జరిగిన తప్పును ఒప్పుకోవాల్సింది పోయి, సిట్ నివేదికను తప్పుగా ప్రచారం చేస్తూ ఇంకా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి సిగ్గులేకుండా దిగజారుతున్న వైసీపీ ముఠా బరితెగింపు ధోరణి చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు.
స్వచ్ఛమైన నెయ్యికి ఉండాల్సిన ఏ లక్షణాలూ లేకుండా, కేవలం కృత్రిమ రసాయనాలు, సబ్-స్టాండర్డ్ ఆయిల్స్‌తో నెయ్యి తయారు చేసినట్లు సిట్ చెపితే దానికి వంకర భాష అద్ది నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్న వైసీపీ నేతలను కఠినంగా శిక్షించాలన్నారు.
శ్రీవారి దర్శనం, ప్రసాదం విషయంలో చిన్న తప్పు జరిగినా హిందువులు తమ ఇంట్లో జరిగినట్లే భావిస్తారని గుర్తుపెట్టుకోండని హెచ్చరించారు. దొంగతనం బయటపడిన తర్వాత వైసీపీ వాళ్లు తమను తాము సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కల్తీ నెయ్యి విషయంలో వాళ్లు చేసింది ముమ్మాటికీ తప్పేనని ఖండించారు. వైసీపీ వాదనను ఎవరూ సమర్థించరు అని తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి దుర్గేష్ తెలిపారు.
