న్యూస్4టుడే, 23 జనవరి 2026 : విజయనగరం జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 27-01-2026న భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం విజయనగరం గంటస్థంభం సమీపంలోని మహారాజా కళాశాల (అటానమస్) ఆవరణలో ఉదయం 10:00 గంటల నుండి ప్రారంభం అవుతుంది.
ఈ జాబ్ మేళాలో మొత్తం నాలుగు ప్రముఖ సంస్థలు సుమారు 595 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. భారత్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలో టెలి కాలింగ్, ప్రాసెసింగ్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ వంటి 400 ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతి నుండి డిగ్రీ వరకు చదివిన 18-30 ఏళ్ల లోపు అభ్యర్థులు వీటికి అర్హులు. ఎంపికైన వారికి నెలకు ₹15,000 నుండి ₹30,000 వరకు జీతంతో పాటు భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తారు.
టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ హోసూర్ (తమిళనాడు) యూనిట్ కోసం 60 మంది జూనియర్ టెక్నీషియన్లను (కేవలం మహిళలు) ఎంపిక చేయనుంది. ఇంటర్ లేదా అంతకంటే ఎక్కువ చదివిన వారు దీనికి అర్హులు, వీరికి ₹19,128 వేతనం ఉంటుంది. హీరో మోటోకార్ప్ సంస్థ శ్రీ సిటీలో పనిచేయుటకు 35 మంది ప్రొడక్షన్ ట్రైనీలను ఎంపిక చేయనుంది. దీనికి 10వ తరగతి, ఇంటర్, ఐటిఐ లేదా డిప్లొమా చేసిన 18-24 ఏళ్ల అభ్యర్థులు (పురుషులు & మహిళలు) అర్హులు, వేతనం ₹14,765 గా నిర్ణయించబడింది. చివరగా, క్విస్ కార్ప్ (Quess Corp) సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో పనిచేయుటకు 100 మంది పురుష అభ్యర్థులను NAPS & NATS విభాగాల్లో ఎంపిక చేయనుంది. డిప్లొమా లేదా బి.టెక్ చదివి, 18-25 ఏళ్ల లోపు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. వీరికి నెలకు ₹18,000 నుండి ₹20,000 వరకు వేతనం లభిస్తుంది.
ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా www.employment.ap.gov.in లేదా www.ncs.gov.in వెబ్‌సైట్‌లలో జాబ్ సీకర్ లాగిన్ ద్వారా తమ పేరు నమోదు చేసుకోవాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా మరియు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో నేరుగా హాజరుకావాలని జిల్లా ఉపాధి అధికారి వహీదా తెలియజేశారు.
